logo

ఏపీలో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్‌తో.. "కలియుగం పట్టణంలో " సినిమా రివ్యూ


నటీనటులు: విశ్వ కార్తీకేయ, ఆయుషీ పటేల్, చిత్రా శుక్లా, రూపాలక్ష్మీ, దేవీ ప్రసాద్, అనీష్ కురువిల్లా తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రమాకాంత్ రెడ్డి

నిర్మాతలు: కందుల ఓబుల్ రెడ్డి, కాటం రమేష్

మ్యూజిక్ డైరెక్టర్: అజయ్ అరసాద

సినిమాటోగ్రఫి: చరణ్ మాధవనేని

ఎడిటర్: గ్యారీ బీహెచ్

కొరియోగ్రఫి: మోయిన్ మాస్టర్

ఆర్ట్: రవిబాబు

సాగర్, విజయ్ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. తల్లి ప్రేమ కోసం విజయ్‌పై సాగర్ ద్వేషం పెంచుకొంటాడు. మానసికంగా సమస్యలు ఉండటంతో సాగర్‌ను హాస్పిటల్‌లో చేర్పిస్తాడు. దాంతో తండ్రిపై కూడా ద్వేషం పెంచుకొంటాడు. ఇదిలా ఉండగా, కాలేజీలో విజయ్‌ను ప్రేమించే శ్రావణి (ఆయూషి పటేల్) నంద్యాల పట్టణంలో మగవాళ్లందరిని చంపుతుంటుంది. నంద్యాలలో వరుస హత్యలే కాకుండా ఆ పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఓ సమస్య కోసం పోలీస్ అధికారి (చిత్ర శుక్లా) ఇన్వెస్టిగేషన్ చేపడుతుంది.

సాగర్‌కు ఎలాంటి మానసిక సమస్య ఉంది? ఆ మానసిక సమస్య కారణంగా అమ్మాయిలు ఎలాంటి కఠిన పరీక్షలను ఎదుర్కొన్నారు. నంద్యాల పట్టణంలో గర్బిణి అమ్మాయిలు ఎందుకు సూసైడ్ చేసుకొంటున్నారు? విజయ్‌ని ప్రేమించి శ్రావణి మగవాళ్లను ఎందుకు చంపుతున్నది? నంద్యాల పట్టణాన్ని పీడిస్తున్న మరో సమస్య ఏమిటి? సాగర్ వికృత ప్రవర్తనకు కాలం ఎలాంటి సమాధానం చెప్పింది? పోలీస్ అధికారి తన ఇన్వెస్టిగేషన్‌లో ఎలాంటి భయంకర వాస్తవాలను తెలుసుకొన్నది? అనే ప్రశ్నలకు సమాధానమే కలియుగ పట్టణంలో సినిమా కథ.

ట్విస్టులు, మదర్ సెంటిమెంట్, ఏపీని పట్టి పీడిస్తున్న ప్రధాన డ్రగ్స్ సమస్య పాయింట్స్‌తో దర్శకుడు రమాకాంత్ రెడ్డి రాసుకొన్న కథ బాగుంది. రకరకాల ట్విస్టులతో డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే కూడా బోర్ కొట్టకుండా సాగింది. అయితే భారమైన పాత్రలను కొత్త వారితో చేయడం వల్ల ఆక్యారెక్టర్లలో ఉండే ఎమోషన్స్‌ను ఆడియెన్స్ ఫీల్ కావడానికి కష్టపడాల్సి వస్తుంది. కొత్తవారైనా ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు సినిమాను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. పేరున్న ఆర్టిస్టులతో తీసి ఉంటే పెద్ద సినిమా అయి ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వ కార్తికేయ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకొన్నాడు. పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకొని చూపించిన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ బాగున్నప్పటికీ.. ఇంకా బెటర్‌గా చేయడానికి స్కోప్ ఉంది. ఇక ఆయూషి పటేల్, చిత్రా శుక్లా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా యాక్టింగ్‌తోపాటు యాక్షన్ సీన్లలో కూడా ఆకట్టుకొన్నారు. తల్లి పాత్రలో రూపాలక్ష్మి ఎమోషనల్‌గా పెర్ఫార్మ్ చేశారు. అనీష్ కురువిల్లా, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అజయ్ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సన్నివేశాలను బలంగా మార్చింది. నీవలనే పెదవిపై తొలిగా పాట బాగుంది. స్థానికంగా ఉండే ప్రదేశాలను సినిమాటోగ్రాఫర్ చూపించిన విధానం బాగుంది , ఎడిటింగ్ సినిమాను గ్రిప్పింగ్ మార్చింది. కందుల ఓబుల్ రెడ్డి, కాటం రమేష్ అనుసరించిన నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ.. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాంకేతిక విలువలు ఉన్నాయి.

డ్రగ్స్‌ యువతను ఎలా నిర్వీర్యం చేస్తుందనే పాయింట్‌తోపాటు మదర్, ఫాదర్ సెంటిమెంట్ జోడించి కలియుగ పట్టణంలో సినిమాను రూపొందించారు. కొత్త వారందరూ తమను తాము నిరూపించుకొనే తాపత్రయం కనిపించింది. కంటెంట్ ఉన్న చిత్ర చిత్రాలను చూడాలనుకొనే వారు ఈ సినిమా చూడొచ్చు. అంచనాలు లేకుండా వెళితే.. దర్శకుడి ప్రయత్నం నిరాశపరచదని చెప్పవచ్చు.

9
1155 views